Ambati Rambabu: చంద్రబాబు ఎవరితోనైనా జతకడతారు.. 6 d ago

AP: ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్లో ఉన్నారన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఆ సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ జెండా మోయడమే కాకుండా టీడీపీ ఆవిర్భావమే తప్పు అని చెప్పారని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికారని, కానీ నేడు మాత్రం ఏవేవో కథలు చెబుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ భూస్థాపితమైందని, ప్రస్తుతం చంద్రబాబు నడుపుతున్న పార్టీ వెన్నుపోటు పొడిచిన తరువాత వచ్చిందని అని విమర్శించారు. తెలుగుదేశానికి ఒంటరిగా పోటీ చేసే శక్తి లేదని, పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల్లో పోటీ చేయగలరా అని ప్రశ్నించారు. ఇది పెద్ద మోసపూరితమైన పార్టీ అన్నారు.
సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని, ఆయన ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకేమైనా చేశారా అని ప్రశ్నించారు. ఆయన ఎవరితో అయినా జతకడతారని, ఏ ఘాతుకానికైనా పాల్పడతారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెబితే ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్, 108, 104 ఇలా అనేక గొప్ప కార్యక్రమాలు గుర్తొస్తాయని, కానీ చంద్రబాబు పేరు చెబితే ఒకటే గుర్తొంస్తుందని అదే వెన్నుపోటని విమర్శించారు. ఇన్ని సంవత్సరాల పరిపాలనలో పలాన పని చేశానని చంద్రబాబు నాయుడు చెప్పగలరా అని ప్రశ్నించారు. ఐటీని చంద్రబాబు తీసుకురాలేదని, అది దేశ వ్యాప్తంగా వచ్చిన మార్పుల్లో భాగంగా వచ్చిందని తెలిపారు.